జూనియర్ ఎన్టీఆర్ ను వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేను: బాలకృష్ణ

  • రాజకీయాల్లోకి రావడం వ్యక్తిగత విషయమన్న బాలయ్య
  • నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో భవిష్యత్ ఉందని వెల్లడి
  • తాను రాజకీయాల్లో, సినిమాల్లో ఒకేసారి కొనసాగుతున్నట్టు వివరణ
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. దీనిపై ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం అని, అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయినా, జూనియర్ ఎన్టీఆర్ కు నటుడిగా ఎంతో భవిష్యత్ ఉందని, ఈ నేపథ్యంలో, వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేనని బాలయ్య స్పష్టం చేశారు. గతంలో తన తండ్రి నందమూరి తారకరామారావు ఏక కాలంలో రాజకీయాలు, సినీ రంగంలో కొనసాగారని, ఇప్పుడు తాను కూడా అదే పంథాలో పయనిస్తున్నానని వివరించారు.


More Telugu News