పంటల మద్దతు ధరను పెంచిన కేంద్రం... మాట నిలబెట్టుకున్నామన్న జవదేకర్

  • 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు
  • ఎంఎస్ఎంఈలకు రూ.20 వేల కోట్ల సబార్డినేట్ రుణాలు
  • ఎంఎస్ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు
కరోనా కష్టకాలంలో కేంద్రం మరికొన్ని చర్యలు తీసుకుంది. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. దీనిపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, ఇవాళ్టి కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతామన్న హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్టు వెల్లడించారు. తాజా నిర్ణయంతో  క్వింటా పత్తి ధర రూ.260 మద్దతు ధర పెంపుతో రూ.5,515కి చేరిందని, క్వింటా వరి ధర రూ.53 మద్దతు ధర పెంపుతో రూ.1,868కి చేరిందని వివరించారు.

అంతేగాకుండా, కష్టాల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నామని జవదేకర్ వెల్లడించారు. రూ.20 వేల కోట్ల సబార్డినేట్ రుణాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ మొత్తంతో 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరనుందని వివరించారు. దాంతోపాటే, ఎంఎస్ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎంఎస్ఎంఈలు స్టాక్ ఎక్చేంజిలో నమోదవుతాయని అన్నారు.


More Telugu News