భారత్ వైపు కోరలు చాస్తోన్న 'నిసర్గ' తుపాను... అరేబియా సముద్రంలో అలజడి!

  • భారత్ కు మరో తుపాను గండం
  • మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల వైపు పయనం
  • జూన్ 3న తీరం దాటే అవకాశం
మొన్న బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఎంఫాన్' తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అరేబియా సముద్రంలో అలజడి రేగింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో తుపానుగా బలపడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. తుపానుగా మారితే దీన్ని 'నిసర్గ' అనే పేరుతో పిలుస్తారు. 'నిసర్గ' భారత పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు. 'నిసర్గ'కు రుతుపవనాలు కూడా తోడైతే కుంభవృష్టి కురవొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇక, నిసర్గ గురి మహారాష్ట్ర, గుజరాత్ లపైనే ఉన్నట్టు భారత వాతావరణ విభాగం చెబుతోంది. ఇది జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాన్ని తాకుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఆ వేగం 125 కిలోమీటర్లకు చేరవచ్చని వివరించారు. జూన్ 3వ తేదీ నుంచి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.


More Telugu News