సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు అమాయకులు... కార్యకర్తల కోసం కోర్టులో పోరాడుతాం: విజయసాయిరెడ్డి

  • వైసీపీ గాంధేయమార్గంలో నడుస్తుంది
  • 16 నెలలు జైల్లో ఉంచినా శాంతియుతంగానే పోరాడాము
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారు అమాయకులు
టీడీపీ రెచ్చగొట్టడం వల్లే తమ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు అమాయకులని, పార్టీ కోసం ఎంతో శ్రమించే వ్యక్తులని తెలిపారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏదైనా కేసులో ఇరుక్కుంటే తాము వారిని దూరం చేసుకోమని అన్నారు. వారి కోసం కోర్టులో పోరాడుతామని చెప్పారు. కోర్టులపై తమకు ఎంతో గౌరవముందని అన్నారు. అందుకే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ పై తప్పుడు కేసులు పెట్టినా, 16 నెలలు  జైల్లో ఉంచినా శాంతియుతంగానే పోరాడామని  తెలిపారు.

వైసీపీ ఎప్పుడూ శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నడుస్తుందని విజయసాయి చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో కూడా తమ సోషల్ మీడియా కార్యకర్తలను ఎంతో టార్చర్ పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలను వెలికి తీస్తే.... వారిని పెట్టడానికి జైళ్లు సరిపోవని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఫేక్ అకౌంట్లు తయారు చేసుకుని విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. కొందరు టీడీపీ కార్యకర్తలు తన పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి... తన పేరుతోనే జగన్ ను దూషించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పారు.


More Telugu News