వైట్ హౌస్ ఎదుట వెల్లువెత్తిన నిరసనలు... టియర్ గ్యాస్ ప్రయోగం!

  • వైట్ హౌస్ కు తాకిన నిరసన సెగలు
  • పెప్పర్ స్ప్రే, ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్ల ప్రయోగం
  • కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు
  • ప్రజలు శాంతంగా ఉండాలంటున్న నేతలు
అమెరికాలో నల్లజాతి వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించి, అతని మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ, లక్షలాది మంది నిరసనలకు దిగుతూ ఉండటంతో, పలు రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. తాజాగా, వైట్ హౌస్ కు నిరసన సెగ తాకింది. వైట్ హౌస్ పక్కనే ఉన్న పార్క్ నకు చేరుకున్న నిరసనకారులు రెచ్చిపోతున్న వేళ, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. నిరసనకారులను తరిమివేసేందుకు పెప్పర్ స్ప్రేలను సైతం వినియోగించారు. భారీగా నిప్పులను వెదజల్లే గ్రనేడ్లను కూడా ప్రయోగించారు.

అమెరికాలోని చాలా నగరాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉండగా, వర్ణ వివక్ష కొనసాగుతోందని నల్లజాతి ప్రజలు చేస్తున్న నిరసనలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. పలు చోట్ల నిరసనకారులు లూటీలకు దిగుతూ ఉండటంతో, పోలీసులు కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక నేతలు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మిన్నిపోలిస్ లో ఏ విధమైన ఆయుధాలు లేని ఓ నల్లజాతి వ్యక్తిని కిందపడేసిన పోలీసులు, అతని మెడపై కాలుపెట్టి అదుముతున్న వీడియో బయటకు రావడం, ఆపై అతను మరణించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్, హూస్టన్ తదితర నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధించిన ప్రభుత్వం, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తోంది.


More Telugu News