విశాఖ జిల్లాలో దారుణం.. మత్తు కోసం స్పిరిట్ తాగి ఐదుగురి మృతి

  • కశింకోటలో ఘటన
  • ఎక్కువ మత్తు ఇస్తుందని స్పిరిట్ తాగి అపస్మారక స్థితి
  • నిన్న ముగ్గురు, నేడు మరో ఇద్దరి మృతి
విశాఖపట్టణం జిల్లాలో దారుణం జరిగింది. మత్తు కోసం స్పిరిట్ తాగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. జిల్లాలోని కశింకోటకు చెందిన ఐదుగురు వ్యక్తులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. వీరిలో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి వస్తూవస్తూ రహస్యంగా సర్జికల్ స్పిరిట్ తీసుకొచ్చాడు. మత్తు ఎక్కువగా ఇస్తుందన్న ఉద్దేశంతో పార్టీలో వారు ఆ స్పిరిట్‌ను తలా కొంత తాగారు.

పార్టీ చేసుకున్న ఐదుగురిలో కునిశెట్టి ఆనంద్ (55), వడిశల నూకరాజు (61), పెతకంశెట్టి అప్పారావు (50)లు ఆదివారం ఉదయం కడుపునొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ఆనంద్, నూకరాజు మృతి చెందగా, అప్పారావు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. స్పిరిట్ తాగిన వారిలో మిగతా ఇద్దరు.. మాణిక్యం, దొరబాబులు ఈ ఉదయం కేజీహెచ్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News