న్యాయవ్యవస్థపై సోషల్ మీడియా కారణంగా అసహనం పెరుగుతోంది: సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యలు

  • న్యాయవాదులపై అపవాదులు పెరుగుతున్నాయని వెల్లడి
  • పరిధి మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన
  • ఇలాగైతే అరాచకమే మిగులుతుందని వ్యాఖ్యలు
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా కారణంగా దేశంలో న్యాయవ్యవస్థ పట్ల అసహనం పెరుగుతోందని అన్నారు. తీర్పులు వెలువరిస్తున్న న్యాయమూర్తులు అపవాదులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హద్దులు మీరి మరీ న్యాయవ్యవస్థ పరిధుల్లోకి చొచ్చుకుని వచ్చి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని వివరించారు. కరోనా నేపథ్యంలో ఓ అంశంపై ఆన్ లైన్ లెక్చర్ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"విమర్శ అనేది కూడా కొంత సమాచారమే. అయితే అది కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. అలాంటి విమర్శలు, అలాంటి సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉంటే వ్యవస్థకు ఏమాత్రం మేలు చేయదు. అలా ప్రతి వ్యవస్థపైనా అపనమ్మకం ఏర్పరచుకుంటే చివరికి మీకు ఏ వ్యవస్థ లేకుండా పోతుంది. అప్పుడు మిగిలేది అరాచకమే" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఇక ఫేక్ న్యూస్ వ్యాప్తికి సోషల్ మీడియా వ్యాప్తి కారణమవుతోందన్న ఆందోళనలపై స్పందిస్తూ, వాక్ స్వాతంత్ర్యాన్ని నిరోధించలేనంతవరకు సోషల్ మీడియాను నియంత్రించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ వెనకున్న ఉద్దేశం చాలా తీవ్రమైనదని, కొన్ని వర్గాల పట్ల వైరాన్ని సృష్టిస్తోందని వివరించారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను అనాలోచితంగా ఫార్వార్డ్ చేస్తుంటారని, ఇటీవలకాలంలో ప్రజలు తమ మత, విశ్వాసాలకు కొద్దిపాటి భంగం కలిగినా నేరుగా కోర్టులకు రావడం ఎక్కువైందని తెలిపారు.


More Telugu News