అచ్చెన్నాయుడు గ్రామంలోనే చర్చ... రెడీయా?: కిల్లి కృపారాణి సవాల్!

  • నిమ్మాడలో వైసీపీకి ఓట్ల పడలేదా 
  • అక్కడ అమ్మఒడి, రైతు భరోసా లేదని నిరూపిస్తారా?
  • బహిరంగ చర్చకు సిద్ధమన్న కిల్లి కృపారాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నిరూపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అంగీకరిస్తే, ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోనే చర్చిద్దామని, అందుకు సిద్ధంగా ఉన్నారా అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సవాల్ విసిరారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, కరోనా వైరస్ తనకు ఎక్కడ సోకుతుందోనన్న భయంతో హోమ్ క్వారంటైన్ లో ఉండిపోయిన అచ్చెన్నాయుడు, తన రాజకీయ ఉనికి కోసం జూమ్ యాప్ ను ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందడం లేదని ఆయన చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. అర్హులైన వారికి పథకాలు అందలేదని అచ్చెన్నాయుడు నిరూపిస్తారా? అంటూ సవాల్ విసిరారు. ఈ పథకాల్లో టీడీపీ నాయకుల కుటుంబాలు కూడా లబ్ది పొందుతున్నాయని, నిమ్మాడలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పడలేదని, అదే ఊరిలో అమ్మఒడి, రైతు భరోసా తదితర పథకాలు అమలు కావడం లేదని నిరూపిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కృపారాణి వ్యాఖ్యానించారు.


More Telugu News