లాక్ డౌన్ 5.0 కాదిది... అన్ లాక్ 1.0... కేంద్ర హోమ్ శాఖ ప్లాన్ ఇది!

  • ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు
  • పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయాలు
  • ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం
కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత లాక్ డౌన్ ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దాన్ని పొడిగిస్తూ వచ్చింది. మూడో విడత నుంచి లాక్ డౌన్ లో సడలింపులు ప్రారంభం కాగా, కుదేలైన ఆర్థిక వృద్ధి గాడిన పడుతున్న సంకేతాలు ఇంతవరకూ రాలేదు. దీంతో ఇకపై లాక్ డౌన్ లు కాకుండా, వ్యవస్థను అన్ లాక్ చేసేలా దశలవారీగా ప్రణాళికలను రూపొందించింది హోమ్ మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగానే జూన్ 30 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూనే, పలు సడలింపులను కూడా ఇచ్చింది.

తొలి దశలో ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, పబ్లిక్ టాయిలెట్లు, రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర ఆతిథ్య సేవా కేంద్రాలు, షాపింగ్ మాల్స్ జూన్ 8 నుంచి తెరచుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండో దశలో స్కూళ్లు, కాలేజీలు, విద్యా కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు తదితరాలను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

ఇక మూడో దశ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా, అంతర్జాతీయ విమానాలు, మెట్రో సేవలు, సినిమా హాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టెయిన్ మెంట్ పార్కులు తదితరాలను పరిస్థితిని బట్టి తెరిపించాలని, ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్నది హోమ్ శాఖ అభిమతం. ఏ నిర్ణయమైనా స్థానిక పరిస్థితిని బట్టే ఉండనుంది. సాంఘిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత పరమైన సభలు, సమావేశాలు, అధికులు హాజరయ్యే కార్యక్రమాలు కూడా ప్రారంభించేందుకు ఓ విధానాన్ని కేంద్రం నిశ్చయించనుంది.

కాగా, రేపటి నుంచి రాష్ట్రాల మధ్య ప్రజలు, సరకు రవాణాకు ఎటువంటి అనుమతులూ అక్కర్లేదని కేంద్రం తేల్చింది. ఇదే సమయంలో వాహనాల రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది. ఇప్పటివరకూ రాత్రి పూట కర్ఫ్యూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకూ ఉండగా, దాన్ని మరో మూడు గంటలు సవరిస్తూ, రాత్రి  నుంచి ఉదయం 5 గంటల వరకూ మాత్రమే ఉండనుంది.

దేశవాళీ విమానాలు, ప్రత్యేక రైళ్లు, శ్రామిక్ రైళ్లు షెడ్యూల్ ప్రకారమే నడువనున్నాయి. కంటైన్ మెంట్ జోన్ గా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రం ఏ విధమైన ఆంక్షల సడలింపులూ ఉండవు. ఏఏ ప్రాంతాలు కంటైన్ మెంట్ జోన్లన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్దారిస్తాయి, ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలవుతాయి. వైద్య, అత్యవసరాలకు మినహా మరెవరినీ అనుమతించరు.



More Telugu News