భారత్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడి

  • అధ్యయనం చేపట్టిన ఐసీఎంఆర్
  • 28.1 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా
  • ఇలాంటివారే వైరస్ వ్యాపింపజేసి ఉంటారన్న ఐసీఎంఆర్
చైనాలో డిసెంబరులో కరోనా కలకలం మొదలైన తర్వాత అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. కాస్త ముందుగా మేల్కొన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. అయితే, భారత్ లో కరోనా వైరస్ వ్యాపించిన తీరుపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికర అంశం వెల్లడించింది.  

జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో 28.1 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా తేలిందని, అలాంటివారు 40,184 మంది ఉన్నారని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించారు. ఇలాంటి కేసుల కారణంగానే భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి లక్షణాలు లేని వ్యక్తులు తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలోనే ఉండొచ్చని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ డైరెక్టర్ మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ఇక, ఇదే కాల వ్యవధిలో కరోనా లక్షణాలు కనబర్చినవారి సంఖ్య 12,810 అని ఐసీఎంఆర్ పేర్కొంది. వారిలో దగ్గు, జ్వరం కామన్ గా కనిపించగా, మూడొంతుల మందిలో గొంతునొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులతో బాధపడుతున్నట్టు గుర్తించారు.


More Telugu News