ఇప్పటికే 90 శాతం హామీలను అమలు చేశాం!: ఏపీ సీఎం జగన్‌

  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాదవుతోన్న వేళ జగన్ ప్రసంగం
  • ఏడాది పాలన పూర్తి నిబద్ధతతో కొనసాగింది
  • రాష్ట్రం నలుమూలలా కోట్లాది మందిని కలిశా
  • పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నా
తాను రాజకీయాల్లోకి వచ్చి 11 ఏళ్లు అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది గడుస్తోన్న సందర్బంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో తాడేపల్లి నుంచి రైతులతో మాట్లాడుతూ.. తమ ఏడాది పాలన పూర్తి నిబద్ధతతో కొనసాగిందని చెప్పగలనని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రం నలుమూలలా కోట్లాది మందిని కలిశానని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశానన్నారు.

రాష్ట్రంలో ప్రజలు చదువు, వైద్యం అందక అప్పులపాలవుతోన్న పరిస్థితులను తాను గమనించానని జగన్ తెలిపారు. గుడి, బడి పక్కన, వీధుల్లో మద్యం అమ్ముతున్న పరిస్థితులను గమనించానని చెప్పారు. ప్రజల జీవితాలను మార్చాలన్న ఆలోచన చేశానని చెప్పారు.

అన్నింటినీ తెలుసుకునే నవరత్నాలను అమలు చేస్తున్నామని, ఇప్పటికే 90 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉండేలా చూశామని చెప్పారు. మేనిఫెస్టోను ఐదేళ్ల కాలానికి రూపొందించామని తెలిపారు. ఇప్పటివరకు 129 హామీలు అమలు కాగా, మరో 77 అమలుకావాల్సి ఉందని చెప్పారు.


More Telugu News