గాలి ప్రసరణ సరిగా లేకుంటే కరోనాను కొనితెచ్చుకున్నట్టే.. యూకే యూనివర్సిటీ అధ్యయనం

  • గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి
  • తుమ్ము, దగ్గు ద్వారా వచ్చే సూక్ష్మ బిందువుల్లోని వైరస్ లక్షణాలు అలానే ఉంటాయి
  • సర్రే యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
ఇళ్లు, కార్యాలయాల్లో గాలి ప్రసరణ సరిగా లేకుంటే కరోనా వైరస్‌ను కొనితెచ్చుకున్నట్టేనని యూకేలోని సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ తెలిపారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గు ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, కానీ వైరస్ కణాలు మాత్రం అక్కడే ఉండిపోతాయని తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతి చోట ఏసీలు ఉన్నప్పటికీ వాటి పనితీరు సక్రమంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని వివరించారు. కాబట్టి అన్ని గదుల్లోకి గాలి, వెలుతురు పూర్తిగా వచ్చేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని హెచ్చరించారు. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఎన్విరాన్‌మెంట్ ఇంటరాక్షన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News