ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డబ్ల్యూహెచ్‌వోకు గుడ్‌బై!

  • కరోనా వైరస్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మండిపాటు
  • చైనాపై ఆంక్షలు
  • డబ్ల్యూహెచ్‌వోకు ఇస్తున్న నిధులను వేరే సంస్థలకు ఇస్తామని ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశారు. నిన్న అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని తొలి నుంచీ ఆరోపిస్తున్న ట్రంప్.. మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు.

వాటి నిర్లక్ష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వైరస్ విషయంలో కీలక అంశాలు దాచిపెట్టిందని ఆరోపిస్తూ చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. 


More Telugu News