జగన్ తన స్థాయిని తానే తగ్గించుకున్నారు: వర్ల రామయ్య

  • నిమ్మగడ్డ రమేశ్ కు జగన్ కులాన్ని అంటగట్టారు
  • హైకోర్టు ఈ తీర్పు ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేది
  • జగన్ కారణంగా సీఎస్, డీజీపీ హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కు కులాన్ని అంటకట్టి ముఖ్యమంత్రి జగన్ తన స్థాయిని తాను తగ్గించుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఆపద తలెత్తుతుందనే భావనతో స్థానిక ఎన్నికలను రమేశ్ వాయిదా వేశారని... అదే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని... రాజ్యాంగ విలువలను రక్షించుకోవడానికి ఈ తీర్పు చాలా అవసరమని చెప్పారు.

హైకోర్టు ఈ తీర్పును ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేదని వర్ల అన్నారు. అత్యవసరంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆర్డినెన్స్ ఇస్తారని చెప్పారు. జగన్ తాను ఏదో సుప్రీం అనుకుంటున్నారని అన్నారు. ఇకపై సంతకాలు చేసే విషయంలో గవర్నర్ ఆచితూచి వ్యవహరించాలని చెప్పారు. జగన్ కారణంగా ఏపీ డీజేపీ రెండు సార్లు హైకోర్టులో నిలబడ్డారని... సీఎస్ తో పాటు మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు నిన్న హైకోర్టుకు వెళ్లారని అన్నారు. ఎస్ఈసీకి సంబంధించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారని... అంటే హైకోర్టు తీర్పు తప్పు అని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.


More Telugu News