టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు: జేసీ దివాకర్ రెడ్డి

  • జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడు
  • ఆయన పాలనకు నూటికి 110 మార్కులు వేస్తా
  • జగన్ రాముడో, రావణుడో జనాలు తేల్చుకోవాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ లాంటి సీఎం ఏపీకి మళ్లీ దొరకడని అన్నారు. ఆయన పాలనకు నూటికి 110 మార్కులు వేస్తానని ఎద్దేవా చేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని చెప్పారు.

రాజ్యాంగం జోలికి వెళ్తే వ్యతిరేక తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని... అయినా మొండి వైఖరితో ముందుకు సాగుతోందని జేసీ అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. తిరుమల వెంకన్న ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. జగన్ రాముడో, రావణాసురుడో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఓట్ల కోసం జగన్ ఇప్పటి నుంచే దృష్టి సారించాలని... ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఓట్లు పడవనే విషయం 2019 ఎన్నికల్లోనే తేలిపోయిందని అన్నారు.


More Telugu News