ప్రభుత్వ ఆసుపత్రులకు ధైర్యంగా వెళ్లండి.. వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు: జగన్

  • రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ
  • సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మందులు ఇస్తున్నాం
వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకూడదని దివంగత వైయస్సార్ ఆలోచించారని... అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అయితే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో 42 లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని... రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేశామని తెలిపారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు. జూలై 8 నుంచి మరో ఆరు జిల్లాలకు సేవలను విస్తరింపజేస్తామని తెలిపారు. మరో ఆరు జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగాలపై ఈరోజు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే భయం వేసేదని... అక్కడ ఇచ్చే మందులు పని చేయవని జనాలు అనుకునేవారని అన్నారు. కానీ, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో మందులు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి, వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పెన్షన్లను ఇస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని తెలిపారు.


More Telugu News