త్వరలో రైతన్నలకు ఎన్నడూ వినని తీపి వార్త చెబుతా... దేశమే ఆశ్చర్యపోతుంది: సీఎం కేసీఆర్

  • కొండపోచమ్మ సాగర్ చేరుకున్న గోదావరి జలాలు
  • ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్
  • తాను చెప్పబోయే శుభవార్త ఎవ్వరూ చెప్పి ఉండరని వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలకమైన ముందడుగు పడింది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో గోదావరి జలాలు తొణికిసలాడాయి. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో కలిసి మర్కుక్ పంప్ హౌస్ వద్ద మోటార్లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ కల సాకారమైందని, రాష్ట్ర చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఓ ఉజ్వల ఘట్టం అని పేర్కొన్నారు. వందల మీటర్ల ఎత్తుకు నీటిని పంపించడం జోక్ కాదని స్పష్టం చేశారు.

అయితే ప్రాజెక్టులను గాల్లో కట్టలేము కాబట్టి, కొన్ని గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని తెలిపారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు రూపుదిద్దుకుందని, వారిపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంటుందని చెప్పారు. నిర్వాసితుల త్యాగాలకు వెలకట్టలేమని, నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ వారికి పనిచేతకాదని విమర్శలు చేసేవారికి తమ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తిరుగులేని సమాధానం ఇచ్చారని కేసీఆర్ వివరించారు.

ఈ సందర్భంగా రైతుల గురించి చెబుతూ, తెలంగాణ వ్యవసాయదారులపై ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా ఎఫ్ సీఐ ధాన్యం సేకరణలో తెలంగాణ నుంచే 63 శాతం ధాన్యం ఉండడం గర్వకారణమని అన్నారు. త్వరలోనే రైతన్నలకు ఎన్నడూ వినని తీపి వార్త చెబుతానని, ఇది విని దేశమే ఆశ్చర్యపోతుందని, ప్రపంచంలోనే రైతులకు ఎక్కడా ఇటువంటి శుభవార్త చెప్పి ఉండరని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.


More Telugu News