చాలా దురదృష్టకరం.. ఉద్యోగులను తొలగించక తప్పడం లేదు: బుక్ మై షో

  • 270 మందిని తొలగిస్తున్న బుక్ మై షో
  • లాక్ డౌన్ వల్ల చాలా అసౌకర్యమైన స్థితిలో ఉన్నామన్న సీఈవో
  • రెండు నెలల జీతాన్ని అదనంగా ఇస్తున్నామని వెల్లడి
లాక్ డౌన్ ప్రభావంతో సినీ పరిశ్రమ మూగబోయింది. థియేటర్లన్నీ మూతపడ్డాయి.  దీంతో, అతిపెద్ద ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సంస్థ 'బుక్ మై షో' తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో ఆశిష్ హేంరజని మాట్లాడుతూ, పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ పరిస్థితి గురించి తమ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా వివరించారు.

'ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో మీతో చెప్పుకోవాలి. అసౌకర్యమైన, దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఉద్యోగుల సంఖ్యను తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇండియా, ఇతర దేశాల్లో మన సంస్థలో 1,450 మంది పని చేస్తున్నారు. వీరంతా వివిధ స్థాయుల్లో ఉన్నారు. వీరిలో 270 మందిని తొలగించాల్సిన పరిస్థితి ఉంది' అని ఆశిష్ తెలిపారు.

270 మందిలో కొందరు సెలవుపై ఉంటారని చెప్పారు. మరికొందరు ప్రస్తుతానికైతే సంస్థతో సంబంధాలు కోల్పోయినట్టేనని... భవిష్యత్తులో అంతా పూర్వ స్థితికి వచ్చిన తర్వాత వీరికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నవారికి రెండు నెలల జీతాన్ని అదనంగా ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ... సెప్టెంబర్ 30 వరకు వారు మెడికల్ ఇన్స్యూరెన్స్ కవరేజిలో ఉంటారని తెలిపారు.

2018లో 'బుక్ మై షో' విలువ 800 మిలియన్ డాలర్లుగా లెక్కకట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో దీని విలువ గతంలో కంటే ఎక్కువగానే ఉంది.


More Telugu News