మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు.. కొనసాగుతున్న కరోనా మారణహోమం!

  • మహారాష్ట్రలో దిగజారుతున్న పరిస్థితులు
  • నిన్న ఒక్క రోజే 2,598 కేసుల నమోదు
  • పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్న పోలీసులు
మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మారణహోమం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 105 మందిని కరోనా బలితీసుకుంది. దేశవ్యాప్తంగా నిన్న సంభవించిన మరణాల్లో ఇది 54 శాతం కావడం గమనార్హం.

అలాగే, రాష్ట్రంలో గత 24 గంటల్లో 130 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య 2,095కి చేరుకుంది. 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,598 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 56,948కి పెరగ్గా, 1,897 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు, బీహార్, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీలలోనూ కరోనా విజృంభిస్తోంది. బీహార్‌లో మొత్తం కేసుల సంఖ్య 3 వేలు దాటగా, ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో ఏకంగా 443 కేసులు వెలుగుచూశాయి. వలస కార్మికుల రాకతో ఇక్కడ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మరోవైపు, కోలుకున్న కేరళలోనూ మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వారం రోజుల్లోనే అక్కడ 300 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక, గురువారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1,58,333 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 6,566 కేసులు వెలుగు చూశాయి. అలాగే, 4,531 మంది చనిపోయారు.


More Telugu News