వివాదాస్పదమైన 'కెంట్' యాడ్... స్పందించిన హేమమాలిని!

  • ఇటీవల డవ్ మేకర్ ను విడుదల చేసిన కెంట్
  • పనిమనుషులను కించపరిచేలా వ్యాఖ్యలు
  • విమర్శలు రావడంతో క్షమాపణలు
తన కుమార్తె ఈషా డియాల్ తో కలిసి నటి, బీజేపీ నేత హేమమాలిని చేసిన ఓ వ్యాపార ప్రకటన తీవ్ర వివాదాస్పదం అయింది. కెంట్ ఆర్వో సంస్థ చేతులు వాడకుండా గోధుమపిండిని కలిపే యంత్రాన్ని పరిచయం చేసింది. ప్రమోషన్ కోసం తమ బ్రాండ్ అంబాసిడర్లు హేమమాలిని, ఈషాలతో కలిసి ఓ యాడ్ ను చేసింది. ఈ ప్రకటనలో పనిమనిషి చేతితో పిండి కలుపుతూ ఉండగా, "మీ పనిమనిషిని పిండిని చేతులతో కలపనిస్తారా? ఆమె చేతులపై క్రిములు ఉండవచ్చు" అని వినిపిస్తుంది.

ఈ ప్రకటన టీవీల్లో రాగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ వెంటనే ప్రకటనను నిలిపివేసిన కెంట్, బహిరంగ క్షమాపణ చెబుతూ ఓ లేఖను విడుదల చేసింది. తాము కావాలని ఈ యాడ్ ను తయారు చేయలేదని, అయినప్పటికీ తప్పు జరిగిందని అంగీకరిస్తున్నామని, ప్రజలు తమను మన్నించాలని కోరింది.

మరోపక్క, అసలు ఇటువంటి వ్యాపార ప్రకటనలు చేయడం ఎందుకంటూ హేమమాలినిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆమె స్పందిస్తూ, "ఇటీవలి కెంట్ ఆర్వో సిస్టమ్స్ అడ్వర్ టయిజ్ మెంట్ లో వెలిబుచ్చిన అంశాలు నాలోని విలువలనేమీ ప్రతిధ్వనించదు. అందులోని డైలాగులు సరికాదు. ఇప్పటికే సంస్థ చైర్మన్ తప్పు జరిగిందని అంగీకరించి, బహిరంగ క్షమాపణలు చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనూ నేను గౌరవిస్తాను" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.


More Telugu News