పుల్వామాలో మరోసారి భారీ ఉగ్రదాడికి యత్నం.. కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు.. వీడియో ఇదిగో

  • లష్కరే, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానం
  • వాహనంలో ఐఈడీ బాంబులతో దూసుకెళ్లి దాడి చేయాలని ప్రణాళిక
  • భద్రతా బలగాల సోదాలు.. కారు వదిలి పారిపోయిన ఉగ్రవాది
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్రదాడికి ప్రయత్నం జరిగింది. అయితే, ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ కుట్రలో లష్కరే, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనంలో ఐఈడీ బాంబులు అమర్చి దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తేలింది.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. దాదాపు 20 కిలోల ఐఈడీతో ఓ కారులో ఈ రోజు ఉదయం ఉగ్రవాది వెళ్తుండగా భద్రతా బలగాలు ఆ కారును ఆపి సోదాలు చేయాలనుకున్నాయి. అయితే, కారు నడుపుతున్న ఉగ్రవాది బారికేడ్లపైకి దూసుకెళ్లి కారుతో పాటు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో కారును అక్కడే వదిలేసి ఉగ్రవాది పారిపోయాడు.

ఉగ్రదాడి జరిగే అవకాశముందని అంతకు ముందే భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి హెచ్చరిక వచ్చింది. దీంతో అప్రమత్తమై నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కారులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అయితే, ఆ సమయంలో పేలుడు సంభవించి కొద్దిగా నష్టంవాటిల్లింది. పస్తుతం ఉగ్రవాది కోసం ఆర్మీ, పోలీసు సిబ్బంది సోదాలు ప్రారంభించాయి. గత ఏడాది పుల్వామాలో ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో వాహనంలో దూసుకొచ్చి భారీ ఉగ్రదాడికి పాల్పడిన విషయం తెలిసిందే.


More Telugu News