కరోనా వున్నా తిరుగుతున్నారంటూ అభ్యంతరం.. కర్నూలు జిల్లాలో చితక్కొట్టుకున్న వైనం!

  • మూడు వారాల క్రితం గ్రామానికి చేరుకున్న వలస కూలీలు
  • 19 మందికి కరోనా సోకడంతో క్వారంటైన్‌కు
  • పూర్తిగా కోలుకోవడంతో ఇళ్లకు పంపిన అధికారులు
కర్నూలు జిల్లాలో గ్రామస్థులు, యువకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కట్టెలు, రాళ్లతో చితక్కొట్టుకున్నారు. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. జిల్లాలోని చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 150 మంది వలస కూలీలు మూడు వారాల క్రితం శ్రామిక్ స్పెషల్ రైలులో గ్రామానికి చేరుకున్నారు. వారందరికీ నిర్వహించిన పరీక్షల్లో 19 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించారు.

తాజాగా వారు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం వారందరినీ అధికారులు గ్రామానికి తరలించారు. గ్రామానికి చేరుకున్న కొందరు బుధవారం సాయంత్రం గ్రామంలో తిరుగుతుండడంతో గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. కరోనా ఉన్నా బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. అది క్రమంగా గొడవకు దారితీసింది.

 దీంతో ఇరు వర్గాలు రెచ్చిపోయి కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పదిమందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News