తెలంగాణలో కరోనా విజృంభణ.. నిన్న ఒక్క రోజే 107 కేసులు.. ఆరుగురి మృతి

  • 2,098కి పెరిగిన కేసులు.. 63కి పెరిగిన మరణాలు
  • విదేశాల నుంచి వచ్చిన 49 మందికి కరోనా
  • కరోనా బారినపడిన 19 మంది వలస కూలీలు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 107 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా కాటుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న నమోదైన కేసుల్లో 39 మాత్రమే తెలంగాణలో నమోదైన కేసులు. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో 19 మంది, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న వారిలో 49 మంది ఉన్నారు. వీటిని మినహాయిస్తే కనుక తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1842కి చేరుకోగా, మృతుల సంఖ్య 63కి పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు 1,321 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 714 మంది వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు, సౌదీ అరేబియా నుంచి ఇటీవల రెండు విమానాల్లో 458 మంది హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని మిలటరీ ఆసుపత్రుల్లో వీరిని క్వారంటైన్‌లో ఉంచి ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో 94 మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. నిన్న ఒక్క రోజే 49 మందికి కరోనా సోకినట్టు తేలింది. లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్రానికి చేరుకుంటున్న వలస కూలీల్లో ఎక్కువమంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 173 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా, నిన్న ఒక్క రోజే 19 మంది కరోనా బారినపడ్డారు.


More Telugu News