మనకెందుకులే అనుకుంటే.. రేపు మనకూ ఇదే పరిస్థితి తప్పదు: టీడీపీ నేత అనిత

  • సుధాకర్‌కు అన్యాయం జరిగితే అది దళిత జాతికే జరిగినట్టు
  • అందరూ కలిసి ఆయనను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారు
  • రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై టీడీపీ నేత వంగలపూడి అనిత ఏపీ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్‌కు అన్యాయం జరిగితే అది ఆయన ఒక్కడికే జరిగినట్టు కాదని, మొత్తం దళిత జాతికి అన్యాయం జరిగినట్టే అవుతుందని అన్నారు.

రాష్ట్రంలో ఓ వైద్యుడి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. విశాఖ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్‌పైనా అనిత మండిపడ్డారు. కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే డాక్టర్ సుధాకర్‌ను పంపిస్తామని అంటున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అందరూ కలిసి సుధాకర్‌ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

సుధాకర్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని మనకెందుకొచ్చిన గొడవ అని ఊరుకుంటే రేపు ఇదే పరిస్థితి మనకీ వస్తుందని అనిత హెచ్చరించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


More Telugu News