ప్రజలంటే వైసీపీ నాయకులకు గౌరవం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • ప్రజలపై జగన్ అధిక ఛార్జీల భారం వేస్తున్నారు
  • భూములు అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చింది
  • నిన్న హైకోర్టు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది
ప్రజలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ అధిక ఛార్జీల భారం వేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే భూములు అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ఏడాదిలోనే ఏపీ ప్రభుత్వం దివాలా తీసిందా? అని నిన్న ఏపీ హైకోర్టు ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు.

అనేక విషయాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన దెప్పిపొడిచారు. ప్రజలంటే వైసీపీ నాయకులకు గౌరవంలేదని, ప్రతిపక్షాలంటే అస్సలే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీ నేతలు చట్టాలు, చట్టసభలపై కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా వైసీపీ సొంత కార్యకర్తలా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఉందని విమర్శించారు. అందుకే  రమేశ్ కుమార్‌ను పదవి నుంచి  తొలగించారని చెప్పారు.


More Telugu News