ఇండిగో విమానంలో కరోనా రోగి... 129 మంది ప్రయాణికులు, సిబ్బంది క్వారంటైన్!

  • చెన్నై నుంచి కోయంబత్తూరుకు విమానం
  • ఈఎస్ఐ ఆసుపత్రికి బాధితుడి తరలింపు
  • విమానాలను శానిటైజ్ చేస్తున్నామన్న ఇండిగో
చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లిన ఇండిగో విమానంలో కరోనా రోగిని గుర్తించిన అధికారులు, అతనితో పాటు ప్రయాణించిన 129 మందితో పాటు విమానం సిబ్బందిని క్వారంటైన్ చేశారు. దాదాపు రెండు నెలల తరువాత దేశీయంగా విమానాల సేవలు మొదలు కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది. 6ఈ 381 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా, చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది.

వెంటనే అతన్ని కోయంబత్తూర్ లోని వినాయక్ హోటల్ కు తరలించి నిర్బంధించిన అధికారులు, ఆపై ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. అతనితో కలిసి ప్రయాణించిన వారందరికీ నెగటివ్ వచ్చినప్పటికీ, అందరినీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు తరలించారు. ప్రయాణికులంతా మాస్క్ లు, ఫేస్ షీల్డులను ధరించారని, కరోనా బాధితుడికి సమీపంలో ఎవరూ లేరని ఇండిగో స్పష్టం చేసింది. సేవలందిస్తున్న విమానాలను తాము క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నామని తెలిపింది.


More Telugu News