చంద్రబాబును క్వారంటైన్ కు తరలించాలి: శ్రీకాంత్ రెడ్డి

  • హైదరాబాదు నుంచి అమరావతికి వెళ్లిన చంద్రబాబు
  • ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
  • రెడ్ జోన్ గుండా చంద్రబాబు వచ్చారన్న శ్రీకాంత్ రెడ్డి
లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి వెళ్లారు. హైదరాబాదు నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశమంతా లాక్ డౌన్ పాటిస్తోందని, సామాజిక దూరాన్ని పాటిస్తోందని... ఈ సమయంలో చంద్రబాబు హైదరాబాదు నుంచి ర్యాలీగా వచ్చారని అన్నారు. మాస్కులు కూడా ధరించకుండా వందలాది మంది టీడీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారని చెప్పారు. ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి చంద్రబాబు ఇలా ఎలా ప్రవర్తిస్తారని  ప్రశ్నించారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రెడ్ జోన్ గుండా వచ్చిన చంద్రబాబును క్వారంటైన్ కు తరలించాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. జూమ్ యాప్ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News