భారత్, చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తత.. డోక్లాం తరహా వివాదం?

  • అప్రమత్తమైన భారత్‌
  • పాంగాంగ్‌, గాల్వన్‌ ప్రాంతాల్లో బలగాల్ని పెంచిన ఇండియా
  • సైనికుల కోసం తాత్కాలిక మౌలిక వసతుల ఏర్పాట్లు 
  • చైనా చర్యలను తీవ్రంగా పరిగణించాల్సిందేనన్న డీఎస్ హూడా 
ఇటీవల భారత్‌పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల వద్దకు దాదాపు 2,500 మంది చైనా సైనికులు చేరుకున్నట్లు తెలుస్తోంది.  2017లో డోక్లాంలో చాలా రోజుల పాటు ఇరు దేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. మరోసారి అదే తరహా పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 
సరిహద్దుల్లో సైనికులను తరలిస్తోన్న చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా పాంగాంగ్‌, గాల్వన్‌ ప్రాంతాల్లో నియంత్రణ  రేఖ వెంట బలగాల్ని పెంచుకున్నట్లు ఓ సైనిక ఉన్నతాధికారి మీడియాకు వివరించారు. అక్కడ సైనికుల కోసం తాత్కాలిక మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో మనదేశానిదే పైచేయని ఆయన చెప్పారు. కీలక ప్రాంతాల్లో చైనా తమ సైనికులను మోహరించడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.

చైనా చర్యలను తీవ్రంగా పరిగణించాల్సిందేనని మాజీ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్ హూడా అన్నారు. గతంలోనూ చైనా నుంచి ఇలాంటి చొరబాట్లు జరిగాయని,  ఈసారి వారు చేస్తున్న పని మాత్రం ఆందోళన కలిగిస్తోందని వ్యూహ వ్యవహారాల నిపుణుడు అశోక్‌ కాంతా కూడా చెప్పారు. రెండు వారాల్లో గాల్వన్‌ లోయలో చైనా సుమారు 100 తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుందని ఆయన చెప్పారు.


More Telugu News