హెరాయిన్‌‌తో దొరికిపోయిన శ్రీలంక యువ పేసర్ షెహాన్ మధుశంక

  • కర్ఫ్యూ అమల్లో ఉండగా స్నేహితుడితో కలిసి కారులో బయటకు
  • ఆపి తనిఖీ చేసిన పోలీసులు
  • రెండు గ్రాముల హెరాయిన్ లభ్యం
శ్రీలంక యువ బౌలర్ షెహాన్ మధుశంక మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం అతడికి రెండు వారాల రిమాండ్ విధించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ ఆ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి రోడ్డెక్కాడు. పన్నాల పట్టణంలో కర్ఫ్యూ విధుల్లో ఉన్న పోలీసులు అతడి కారును ఆపి తనిఖీ చేయగా మధుశంక వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది.

 దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల రిమాండ్‌కు తరలించారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల మధుశంక బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి వన్డేలోనే చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు టీ20ల్లోనూ మధుశంక శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు.  గాయం కారణంగా 2018లో జరిగిన నిదహాస్ ట్రోఫీ‌కి దూరమయ్యాడు.


More Telugu News