లాక్ డౌన్ కష్టకాలంలో యాచకురాలిని పెళ్లాడిన ఆటో డ్రైవర్

  • కాన్పూర్ లో ఘటన
  • అన్నావదినల వేధింపులతో రోడ్డునపడ్డ  యువతి
  • ఆమె వివరాలు తెలుసుకుని చలించిపోయిన ఆటోడ్రైవర్
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు విధించిన లాక్ డౌన్ అనేకమందికి ఉపాధిని దూరం చేసింది. అయితే ఓ యాచకురాలికి మాత్రం పెళ్లి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. ఓ యాచకురాలు, ఆటో డ్రైవర్ పెళ్లితో ఒక్కటయ్యారు.

కాన్పూర్ కు చెందిన నీలమ్ ది దీనగాథ. కొన్నాళ్ల క్రితం తండ్రి మరణించగా, తదనంతరం తల్లి కూడా ఈ లోకాన్ని విడిచింది. దాంతో అన్నావదినల పంచన చేరిన నీలమ్ కు వేధింపులు ఎదురయ్యాయి. ఆదుకుంటారనుకున్న అన్నావదినలు ఇంటి నుంచి గెంటేశారు. దాంతో చేసేది లేక రోడ్డుపై భిక్షాటన చేయడం మొదలుపెట్టింది.

అయితే లాక్ డౌన్ విధించడంతో ఆమెకు భిక్షం వేసేవాళ్లే కరవయ్యారు. దాంతో ఆమె కడుపునిండా తిండిలేక అలమటించింది. ఈ క్రమంలో నీలమ్ కు ఆటోడ్రైవర్ అనిల్ పరిచయం అయ్యాడు. ఓ రోజు ఆహారం పంపిణీ చేస్తుండగా నగరంలోని ఓ క్రాసింగ్ వద్ద యాచన చేస్తున్న నీలమ్ ను చూశాడు. అతని మనసు కరిగిపోయింది. ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత మరింత ఇష్టం కలిగింది.

ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడమే కాదు, కొన్నిరోజుల్లోనే అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటే భిక్షాటన వదిలేస్తావా అని అనిల్ అడగ్గా, నీలమ్ సంతోషంతో అంగీకరించింది. దాంతో నగరంలోని ఓ బుద్ధాశ్రమంలో ఆమెను పెళ్లాడి కొత్త జీవితం అందించాడు.


More Telugu News