టీటీడీ నిర్ణయాలు వివాదాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది: విజయశాంతి

  • ఒకటికి వందసార్లు ఆలోచించాలన్న విజయశాంతి
  • భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని వెల్లడి
  • ఆధ్యాత్మికవేత్తల నుండి సలహాలు తీసుకోవాలని టీటీడీకి సూచన
టీటీడీ ఆస్తుల అమ్మకం అంశంపై తెలంగాణ కాంగ్రస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే ఏ నిర్ణయమైనా వివాదాలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని, ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలతో టీటీడీ వివాదాలకు కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తాజాగా, టీటీడీ భూముల విక్రయం అంశంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే దిశగా విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తీసుకున్న చొరవను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. మున్ముందు కూడా టీటీడీ బోర్డు తీసుకునే కీలక నిర్ణయాలపై ఆధ్యాత్మిక వేత్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఊహ తెలిసినప్పటి నుండి భక్తి ప్రపత్తులతో ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి దర్శనం చేసుకున్న భక్తురాలిగా తన అభిప్రాయాలు తెలియజేశానని తన పోస్టులో వివరించారు.


More Telugu News