దేశీయ విమాన ప్రయాణాల తొలిరోజే గందరగోళం... 80కి పైగా విమానాలు రద్దు!

  • నేటి నుంచి దేశీయ విమాన ప్రయాణాలు
  • సర్వీసులు రద్దవడంతో ప్రయాణికుల్లో నిరాశ
  • రాష్ట్రాలు అంగీకరించడంలేదన్న ఎయిర్ పోర్టు అధికారులు
రెండు నెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఎయిర్ పోర్టులన్నీ ప్రయాణికులతో కళకళలాడాయి. అయితే, భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీ, ముంబయి ఎయిర్ పోర్టుల్లో ఈ పరిస్థితి కనిపించింది. ఒక్క ఢిల్లీలోనే 82 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

వివిధ పనుల నిమిత్తం విమానాల్లో ప్రయాణించేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు సర్వీసులు రద్దు కావడంతో ఉసూరుమన్నారు. చివరి నిమిషం వరకు విమానం రద్దు గురించి తెలియకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. దీనిపై ప్రయాణికులు ఎయిర్ పోర్టు అధికారులను నిలదీయగా, విమాన సర్వీసులకు అనుమతించలేమని అనేక రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని వారు బదులిచ్చారు. అటు, ముంబయి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. తాము ప్రయాణించాల్సిన విమాన సర్వీసులు రద్దవడంతో అనేకమంది ఎయిర్ పోర్టు వెలుపల దిగాలుగా కనిపించారు.


More Telugu News