లింగ సమానత్వం కోసం ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం!

  • మెడికల్ షాపుపై గుప్తా అండ్ డాటర్స్ అంటూ రాయించిన వ్యక్తి
  • సాధారణంగా ఆర్వీ అండ్ సన్స్, చందన బ్రదర్స్ అంటూ పేర్లు
  • సమాజంలో లింగ వివక్ష ఉండరాదని భావించిన లూధియానా కాంట్రాక్టరు
చాలామంది వ్యక్తులు తమ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, దుకాణాల పేర్లలో సన్స్, బ్రదర్స్ అనే పేర్లను చేర్చుతుంటారు. రాజారాం అండ్ సన్స్ అనో, ఆర్ఎస్ బ్రదర్స్ అనో పేర్లు రిజిస్టర్ చేయిస్తుంటారు. అయితే, ఇది బొత్తిగా పురుషాధిక్యతను సూచిస్తోందని, సమాజంలోని లింగ వివక్షను మరింతగా ప్రస్ఫుటిస్తోందని పంజాబ్ లోని లుధియానాకు చెందిన మనోజ్ కుమార్ గుప్తా (54) అనే కాంట్రాక్టరు భావించారు. అందుకే తన మెడికల్ షాపుపై గుప్తా అండ్ డాటర్స్ అంటూ లింగ సమానత్వాన్ని సూచించే విధంగా రాయించారు.

ఇప్పుడీ దుకాణం బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లింగ వివక్షను తొలగించే క్రమంలో ఇదో చిన్న ప్రయత్నం మాత్రమేనని మనోజ్ కుమార్ తెలిపారు. భవన నిర్మాణ రంగానికి చెందిన ఓ కంపెనీ నడుపుతున్న మనోజ్ కుమార్ దానిపేరును గుప్తా అండ్ సన్స్ అంటూ గతంలో రిజిస్టర్ చేయించారు. అయితే లింగ సమానత్వం ఉండాలని బలంగా నమ్మే ఆయన మందుల దుకాణాన్ని కుమార్తె ఆకాంక్ష పేరిట రిజిస్టర్ చేయిస్తూ దానిపై గుప్తా అండ్ డాటర్స్ అని రాయించి తనలోని అభ్యుదయ భావాన్ని చాటుకున్నారు. గుప్తాకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు రోషన్ కరణ్ ఎంబీఏ చదివాడు. కుమార్తె ఆకాంక్ష న్యాయ విద్య అభ్యసిస్తోంది.


More Telugu News