తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. మాడిపోతున్న జనం!

  • సూరీడి ఉగ్ర రూపానికి జనం విలవిల
  • ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో నిన్న 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
తెలంగాణపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక ప్రజలు ఠారెత్తిపోతున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ఉన్నా సూరీడి ఉగ్రరూపానికి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. ఓవైపు ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాల్పులు మరింత భయం పుట్టిస్తున్నాయి.

ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో నిన్న ఏకంగా 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే వడగాల్పులు తప్పవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

తీరం దాటిన ఎంపాన్ తుపానుతోపాటు తేమ కూడా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని, దీనికితోడు ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు, పొడి గాలులు వస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరించారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో నిన్న 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తున్నా హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు మాత్రం నిర్ధారించలేదు.


More Telugu News