కరోనా కోసం ఇచ్చిన నిధులను ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియడం లేదు: టీడీపీ నేత సోమిరెడ్డి

  • పేదవాళ్లకి పట్టెడన్నం పెట్టడానికి కూడా వైసీపీ నేతలు ముందుకురావట్లేదు
  • కరోనా పేరుతో కలెక్షన్లు చేసుకుంటున్నారు
  • పాలన ప్రజల కోసం జరుగుతుందా? ప్రజాప్రతినిధుల కోసమా?
  • విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.120 కోట్లు భారం మోపారు
కరోనా విజృంభణ నేపథ్యంలో వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చుపెట్టారో తెలియడం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదవాళ్లకి పట్టెడన్నం పెట్టడానికి కూడా వైసీపీ నేతలు ముందుకు రావడం లేదని,  కరోనా పేరుతో కలెక్షన్లు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలన ప్రజల కోసం జరుగుతుందో లేక ప్రజాప్రతినిధుల కోసం జరుగుతుందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.120 కోట్లు భారం మోపారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యవసర సరుకులు కూడా భారీగా పెరిగిపోయాయని తెలిపారు. అంతేగాక, గతంలో చీప్ లిక్కరు క్వార్టర్ రూ.50గా ఉంటే, అది ఇప్పుడు రూ.200కు చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరక మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.


More Telugu News