అవన్నీ పనికిరాని స్థలాలే... వేలం వేయనున్న టీటీడీ భూములపై వైవీ సుబ్బారెడ్డి వివరణ!

  • ఆస్తుల విక్రయానికి చదలవాడ చైర్మన్ గా ఉన్న సమయంలోనే నిర్ణయం
  • నాలుగేళ్ల క్రితమే నిరర్ధక ఆస్తులను అమ్మాలని తీర్మానం
  • అప్పటి నిర్ణయాలనే అమలు చేస్తున్నామన్న వైవీ సుబ్బారెడ్డి
ఏపీ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయించాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తగా బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. విక్రయించాలని చూస్తున్న 50 ఆస్తులు ఆలయానికి ఏ మాత్రమూ ఉపయోగపడవని, అవి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీటీడీకి మేలు కలిగించేందుకే ఈ ఆలోచన చేశామని, ఆస్తుల విక్రయం, లీజు అధికారాలు బోర్డుకే ఉంటాయని, ప్రభుత్వానికి ఈ నిర్ణయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

1974 నుంచి 2014 మధ్య మొత్తం 129 ఆస్తులను వేలం విధానంలో టీటీడీ అమ్మిందని గుర్తు చేసిన వైవీ సుబ్బారెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌ గా ఉన్న సమయంలోనే 2015 జూలై 28న 84వ నంబర్ తీర్మానం ద్వారా బోర్డుకు ఉపయోగపడని ఆస్తులను గుర్తించి, విక్రయించే అవకాశాలు పరిశీలించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు 2016, జనవరి 30న చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి నిరర్దక ఆస్తుల బహిరంగ వేలానికి ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

ఇందులో భాగంగా తమిళనాడులోని 23 ఆస్తులు, ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 17 ఆస్తులు, పట్టణాల్లోని 9 ఆస్తులను విక్రయించాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారని, వాటి విలువను కూడా సేకరించి, బోర్డుకు రిపోర్ట్ చేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆనాటి బోర్డు నిర్ణయాన్నే తాము అమలు చేస్తుంటే, కొన్ని టీవీ చానెళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.


More Telugu News