కరోనా తొలి టీకా మానవులపై... ఫలితాలేంటన్న విషయమై 'ది లాన్సెట్' ప్రత్యేక కథనం!

  • బీజింగ్ లో మనుషులపై తొలి దశ టీకా పరిశోధనలు
  • 28 రోజుల ఫలితాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు
  • మరింతగా పరిశోధనలు చేస్తామని వెల్లడి
పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ గురించి తీవ్రమైన పరిశోధనలు చేస్తున్న వేళ, తొలి దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరిన తొలి వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలను అందించిందని మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే ప్రతి రక్షకాలు విడుదల అయ్యాయని, రోగ నిరోధక వ్యవస్థలోని కీలకమైన టీ-సెల్స్ సమర్థవంతంగా స్పందించాయని జర్నల్ వెల్లడించింది. 108 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా, 28 రోజుల తరువాత సత్ఫలితాలు కనిపించాయని తెలిపింది.

ఇదిలావుండగా, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే, కరోనా నుంచి ఏ మేరకు రక్షణ లభిస్తుందన్న విషయమై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని అణచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ కీలక అడుగని వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనాను ఎదుర్కొనే టీ-సెల్స్ 14 రోజుల్లోనే తయారయ్యాయని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ కు ప్రస్తుతం 'ఏడీ5 ఎన్ కోవ్' అని పేరు పెట్టామని, దీనిపై మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయని వే చెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే క్రమంలో పలు సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని, వాటిని ఎదుర్కొని ముందడుగు వేస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు.

కాగా, ఈ వ్యాక్సిన్ ను మానవుల్లో జలుబుకు కారణమయ్యే బలహీనమైన అడినో వైరస్ నుంచి తయారు చేశారు. దీనిలో కరోనా వైరస్ ను పోలివుండే ప్రొటీన్ ను అభివృద్ధి చేసి, జన్యు పదార్థాలను ఉత్పత్తి చేసి, తద్వారా ఏర్పడే స్పైక్ (మొన) ప్రొటీన్ తో ప్రతి రక్షకాలను విడుదల చేసేలా చూశారు. వ్యాక్సిన్ ను లింఫ్ నోడ్స్ (శోషరస గ్రంధులు) వద్దకు పంపడం ద్వారా, కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ ను అది గుర్తించి, దానితో పోరాడే శక్తిని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుంది.

ఇక ఈ ప్రయోగం జరిగిన విధానం గురించి పరిశీలిస్తే, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వివిధ మోతాదుల్లో వ్యాక్సిన్ ఇచ్చారు. ఆపై వారి రక్త నమూనాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, కణాల ప్రతిస్పందనను నమోదు చేశారు. తక్కువ మోతాదులో వ్యాక్సిన్ తీసుకున్న 83 శాతం మందిలో, ఎక్కువ మోతాదులో తీసుకున్న 75 శాతం మందిలో వారం రోజుల తరువాత అతి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించాయని, ఆపై 28 రోజుల్లోగా పెద్ద దుష్ప్రభావాలేమీ చాలా మందిలో కనిపించలేదని సైంటిస్టులు తెలిపారు. ఇక వీరిలో ఏర్పడిన ప్రతిరక్షకాలు, వారం రోజుల్లోనే నాలుగు రెట్లు పెరిగాయని గుర్తించామని, వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందిలో టీ-సెల్స్ కూడా తయారయ్యాయని వెల్లడించారు.


More Telugu News