టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఎంపీపీ సుకన్య ఫిర్యాదు
  • తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ
  • ఎంఐఎం ఎమ్మెల్యే బలాలాపై ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకురాలు శృతి
హైదరాబాదులో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఓల్డ్ సిటీ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఉన్నారు.

ఇటీవలే యాచారంలో జరిగిన ఓ రహదారి శంకుస్థాపనకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెళ్లారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని యాచారం ఎంపీపీ సుకన్య అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఆమెకు ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో, మాచిరెడ్డి తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు వారందరిపై అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

మరోవైపు తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అహ్మద్ బలాలాపై బీజేపీ నాయకురాలు బంగారు శృతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల చాదర్ ఘాట్ పరిధిలో ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు శృతి అక్కడకు వెళ్లిన సమయంలో బలాలా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బలాలా తనను కించపరిచేలా మాట్లాడారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో బలాలాపై అట్రాసిటీ కేసు నమోదైంది.


More Telugu News