హైదరాబాదులో గందరగోళం... భర్త అదృశ్యమయ్యాడంటున్న మహిళ, కరోనాతో చనిపోయాడంటున్న డాక్టర్లు!

  • భర్త కోసం అలమటిస్తున్న మహిళ
  • ఆమె కుటుంబంలో 11 మందికి కరోనా
  • మే 16న మహిళ డిశ్చార్జి
  • ఆమె భర్త మే 1నే మరణించాడంటున్న  వైద్య వర్గాలు
హైదరాబాదులో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ వ్యక్తికి సంబంధించి గందరగోళం నెలకొంది. వనస్థలిపురంకు చెందిన ఓ మహిళ తన భర్త కనిపించడంలేదని చెబుతుండగా, గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మాత్రం అతడు కరోనాతో మృతి చెందాడని అంటున్నారు.

అసలు విషయం ఏంటంటే... వనస్థలిపురానికి చెందిన ఓ కుటుంబంలో 11 మందికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు భార్యభర్తలు కూడా ఉన్నారు. ఓ కుటుంబ సభ్యుడికి కరోనా రావడంతో అతడ్ని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లడంతో వారందరూ కూడా కరోనా బారినపడ్డారు. అయితే, మే 16న మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కరోనా నుంచి కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. భర్త గురించి అక్కడి సిబ్బందిని వాకబు చేసిన ఆమెకు దిగ్భ్రాంతిగొలిపే సమాధానం వినవచ్చింది. వెంటిలేటర్ పై ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు బదులిచ్చాయి.

రోజులు గడిచేకొద్దీ ఆసుపత్రి సిబ్బంది ఏమీ చెప్పకపోవడంతో భర్త కనిపించడం లేదంటూ ఆమె తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా సాయం కోరింది. దీనిపై గాంధీ ఆసుపత్రి సూపరింటిండెంట్ స్పందిస్తూ, ఆమె భర్త మే 1నే చనిపోయాడని స్పష్టం చేశారు. దాంతో ఆమె, తన భర్త చనిపోయిన విషయం తమకు చెప్పకుండా ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. తన భర్త నిజంగానే చనిపోయాడనేందుకు ఆధారాలు చూపించాలని, ఒకవేళ అంత్యక్రియలు జరిగుంటే అందుకు సాక్ష్యాలు ఏవని నిలదీసింది.

ఇక, ఈ వ్యవహారంలో తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకోకతప్పలేదు. ఆ వ్యక్తి మరణంపై భార్యకు సమాచారం అందించకపోవడం నిజమేనని, అయితే అందుకు తగిన కారణం ఉందన్నారు. అప్పటికే కరోనాతో పోరాడి ఎంతో బలహీనంగా ఉన్న ఆమెకు భర్త మరణవార్త చెబితే దిగ్భ్రాంతికి గురవుతుందని, ఆమెకు చెప్పవద్దని ఆమె కుటుంబసభ్యులే సూచించారని వివరణ ఇచ్చారు. ఆమె మామగారు కూడా కొన్నిరోజుల క్రితమే మరణించిన నేపథ్యంలో మరో చావు గురించి చెప్పి మరింత విషాదంలోకి నెట్టాలని భావించలేదని అన్నారు.

కరోనా మృతుల అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు పాల్గొంటున్న సంఘటనలు చాలా తక్కువగా ఉంటున్నాయని, కొందరు క్వారంటైన్ లో ఉంటుండడం, మరికొందరు భయపడిపోవడంతో ప్రభుత్వ సిబ్బందే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారని ఈటల వివరించారు. అంతేకాకుండా, కరోనాతో మరణించినవారి మృతదేహాలను ఎక్కువకాలం భద్రపరచడం కూడా సాధ్యం కాదని, అది ఎంతో ప్రమాదకరం అని తెలిపారు.


More Telugu News