కొడుకును రక్షించి.. తాను మృతి చెందిన మాజీ రెజ్లర్, సినీనటుడు గాస్పర్డ్!

కొడుకును రక్షించి.. తాను మృతి చెందిన మాజీ రెజ్లర్, సినీనటుడు గాస్పర్డ్!
  • అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన
  • వినీస్‌ మెరీనా బీచ్‌ కు వెళ్లిన మాజీ రెజ్లర్‌ షాద్‌ గాస్పర్డ్‌  
  • సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం
బీచ్ వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి తన కుమారుడు మునిగిపోతోన్న నేపథ్యంలో అతడిని కాపాడే క్రమంలో మాజీ రెజ్లర్‌ షాద్‌ గాస్పర్డ్‌ (39) ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినీస్‌ మెరీనా బీచ్‌లో ఆయన సముద్రంలో కొట్టుకుపోయాడని, అతడి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిందని అక్కడి అధికారులు మీడియాకు తెలిపారు.

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బీచ్‌లలోకి అనుమతించలేదు. ఇటీవలే ఆంక్షలు సడలించడంతో సందర్శకులు బీచ్‌ల వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే గాస్పర్డ్‌ తన కుమారుడు ఆర్యేహ్‌ (10)తో కలిసి అక్కడకు వెళ్లి ఈత కొడుతుండగా ఓ భారీ అల వచ్చి తండ్రీకొడుకులను లాక్కుపోయింది.

దీంతో అక్కడి గార్డ్స్ వెంటనే వీరిని రక్షించడానికి ఉరకగా.. తన కుమారుడిని వారి వైపు తోసేసి, ముందు అతనిని రక్షించాలని గాస్పర్డ్ కోరాడు. దీంతో తాము ఆ బాలుడిని తీసుకొని ఒడ్డుకు చేర్చామని, అనంతరం వెంటనే గాస్పర్డ్‌ కోసం వెతకగా అతడు అప్పటికే సముద్రంలో కొట్టుకుపోయాడని తెలిపారు. 2010లో ఆయన డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైరయ్యాడు. అనంతరం సినిమాల్లో నటిస్తున్నాడు.


More Telugu News