పాక్ వైపు నుంచి వచ్చి పడిపోతున్న మిడతలు.. ఐరాస హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తం!

  • భారత్‌లోని పంటలకు ప్రమాదకరంగా పరిణమించిన మిడతలు
  • నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన భారత్
  • మిడతల దెబ్బకు వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన పాక్
పాకిస్థాన్ నుంచి వచ్చి పడుతున్న మిడతల దండు వల్ల భారత సరిహద్దులోని పంటలకు ప్రమాదం పొంచి వుందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరికలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని ఎదుర్కొనేందుకు బ్రిటన్ నుంచి ప్రత్యేక డ్రోన్లు, ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.

పాక్ నుంచి వస్తున్న ఈ మిడతలు చాలా ప్రమాదకరమైనవి. రోజుకు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అంతేకాదు, ఒక చదరపు మీటరు సమూహంలో ఉన్న మిడతలు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని గుటుక్కుమనిపించేయగలవని  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపింది.

ఈ మిడతల దాడుల వల్ల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. మిడతల దండు దాడిపై దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వాటి నివారణకు నడుంబిగించింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మిడతల నియంత్రణ కార్యాలయాలతో కలిసి 50 స్ప్రేయింగ్ పరికరాలు, వాహనాలతో మిడతలను నివారించాలని ఆ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్ణయించారు.

తూర్పు ఆఫ్రికాలో తుపాన్ల వల్ల మిడతల సంతానోత్పత్తి పెరిగిందని, ఫలితంగా భారత్, చైనా, పాకిస్థాన్‌ దేశాల్లోని పంటలకు ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వీటి దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఇప్పటికే వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.


More Telugu News