కరోనాపై ఉన్న భయాలను పటాపంచలు చేసిన అధ్యయనం!

  • వ్యక్తుల నుంచి వ్యక్తులకే వైరస్  సంక్రమణం
  • పేపర్లు, కరెన్సీ ద్వారా వైరస్ వ్యాప్తి చెందదు
  • సీడీసీ అధ్యయనం వాస్తవానికి దగ్గరగా ఉందంటున్న నిపుణులు
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనం కరోనా విషయంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పటాపంచలు చేసింది. మనుషుల నుంచి మనుషులకు తప్పితే మరే రకంగానూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని తేల్చి చెప్పింది. కరోనా రోగులు ముట్టుకున్న వస్తువులు, వారు తిరుగాడిన ప్రదేశాలు, న్యూస్ పేపర్, కరెన్సీని ముట్టుకోవడం వల్ల వైరస్ ఇతరులకు సోకదని స్పష్టం చేసింది. ఇలా సోకినట్టు ఇప్పటి వరకు ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొంది.

కరోనా రోగులను కలవడం ద్వారా కానీ, లేదంటే వారి ద్వారా సోకిన ఇతరులను కలవడం వల్ల కానీ, వారి పక్కనే ఉండడం వల్ల కానీ వైరస్ సంక్రమిస్తుందని వివరించింది. వైరస్‌ ఉన్న వ్యక్తి తాకిన వస్తువులను, అతడు తాకిన ఉపరితలాన్ని మరో సాధారణ వ్యక్తి చేతితో ముట్టుకుని నోరు, ముక్కు, కళ్లను తాకడం వల్ల కరోనా రావొచ్చని తెలిపింది. ఈ మహమ్మారి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మాత్రమే సోకుతుందని పేర్కొంది.

అయితే, అంతమాత్రాన పరిశుభ్రంగా ఉండడం మానొద్దని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అధ్యయనం సూచించింది. కాగా, సీడీసీ అధ్యయనంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీడీసీ అధ్యయనం వాస్తవానికి దగ్గరగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉపరితలాలు, వస్తువుల ద్వారా వైరస్ సోకడం అంటూ జరిగితే కనుక, దేశంలో ఇప్పటికే లక్షలాది కేసులు నమోదయ్యేవని చెబుతున్నారు.


More Telugu News