1200 కి.మీ సైకిల్ తొక్కిన జ్యోతికి సీఎఫ్ఐ నుంచి ఆహ్వానం!

  • గురుగ్రామ్ నుంచి దర్బంగాకు ప్రయాణం
  • హ్యాట్సాఫ్ చెప్పిన నెటిజన్లు
  • ట్రయల్స్ కు ఆహ్వానించిన సైక్లింగ్ సమాఖ్య
గురుగ్రామ్ లో ఉంటున్న 15 సంవత్సరాల జ్యోతి అనే బాలిక, తన తండ్రిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకుని, 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి 8 రోజుల్లో చేరిన వైనం గురించి తెలుసుకున్న భారత సైక్లింగ్ సమాఖ్య (సీఎఫ్ఐ - సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా), ఆమెకు బంపరాఫర్ ఇచ్చింది. వెనుక ఒకరిని కూర్చోబెట్టుకుని, అంతదూరం ప్రయాణం చేసిన ఆమె శక్తి, సామర్థ్యాలు, తెగువకు ఆశ్చర్యపోయిన సమాఖ్య, నిన్న ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడింది.

ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్ లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య చైర్మన్ ఓంకార్ సింగ్ తెలిపారు. కాగా, ఈ నెల 10న చేతిలో డబ్బులేని స్థితిలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన జ్యోతి, రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ, 18న దర్బంగా సమీపంలోని స్వస్థలానికి చేరగా, సోషల్ మీడియా ఆమె సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పింది. లాక్ డౌన్ కారణంగా చేతిలో పనిలేకపోవడం, ఇంటి యజమాని గెంటేసేలోగానే వెళ్లిపోవాలని భావించిన జ్యోతి, ప్రమాదంలో గాయపడిన తండ్రిని తీసుకుని స్వగ్రామానికి చేరుకుంది.


More Telugu News