కరోనా కేసులు, మరణాల్లో న్యూయార్క్‌ను తలపిస్తున్న ముంబై.. ఎన్నో సారూప్యతలు!

  • ముంబైలో ఆందోళనకరంగా పెరుగుతున్న కేసులు
  • అచ్చం న్యూయార్క్‌లోని పరిస్థితే ముంబైలోనూ
  • వేగంగా పెరుగుతున్న కేసులు
కరోనా కేసులు, మరణాల జాబితాలో దేశంలోనే మహారాష్ట్ర ముందుంది. ఇప్పటి వరకు అక్కడ 39,297 కేసులు నమోదు కాగా, 1,390 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తం మరణాల్లో ఒక్క ముంబైలోనే ఇప్పటి వరకు 24,118 కేసులు నమోదు కాగా, 841 మంది మరణించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడే వెలుగుచూస్తుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ముంబై మరో న్యూయార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 21 శాతం ముంబైలోనే నమోదవుతుండడమే ఇందుకు కారణం. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు. అటు న్యూయార్క్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అంతేకాదు, ఈ రెండు నగరాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి.

ఈ రెండు నగరాల్లోనూ లెక్కలేనంతమంది ధనవంతులు ఉన్నారు. అలాగే లెక్కకుమించి పేదలూ ఉన్నారు. రెండు నగరాలు జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలే. న్యూయార్క్‌లో చదరపు కిలోమీటర్‌కు 10 వేల మంది నివసిస్తుండగా, ముంబైలో 32 వేలమందికిపైగా నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం అత్యాశే అవుతుంది.

న్యూయార్క్‌లో 3.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 28 వేలమందికిపైగా మరణించారు. అయితే, ముంబైలో కేసులు, మరణాలు ఆ స్థాయిలో లేకున్నా వేగంగా పెరుగుతుండడమే ఆందోళనకు గురిచేసే అంశం. న్యూయార్క్‌లో కేసులు పెరిగినప్పుడు ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లకు కొరత ఏర్పడింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ముంబైలో ఉందని, ఇదంతా చూస్తుంటే ముంబై మరో న్యూయార్క్‌ను తలపిస్తోందని నిపుణులు అంటున్నారు.


More Telugu News