అమెరికాలో రెండు డ్యామ్ లు ఫెయిల్... సెంట్రల్ మిచిగన్ ను ముంచెత్తిన వరద!

  • వరద నీటిని నియంత్రించడంలో విఫలం
  • మిడ్ ల్యాండ్ ప్రాంతంలో 9 అడుగుల ఎత్తున నీరు
  • వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సెంట్రల్ మిచిగన్ ప్రాంతంలో పైనుంచి వచ్చిన వరద నీటిని నియంత్రించడంలో రెండు డ్యామ్ లు విఫలం కాగా, వరద నీరు సమీపంలోని కాలనీలను ముంచెత్తింది. దీంతో అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డెట్రాయిట్ కు 140 మైళ్ల దూరంలో ఉన్న ఈడెన్ విల్లీ, శాన్ ఫోర్డ్ డ్యామ్ లు విఫలం కాగా, ఆ వెంటనే జాతీయ వాతావరణ సంస్థ నుంచి ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ జారీ అయింది. టిట్టాబావాస్సీ నది పరిసరాల్లో వరద నీటి ప్రభావం అధికంగా ఉంది.

డ్యామ్ చుట్టుపక్కల ఉన్న ఈడెన్ విల్లీ, శాన్ ఫోర్డ్, మిడ్ ల్యాండ్ ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించామని గవర్నర్ గ్రెట్చెన్ తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు క్షణక్షణానికీ పెరిగిపోతున్నదని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన తరలింపు సాగుతోందని తెలిపారు. చుట్టుపక్కల టౌన్ షిప్ లలో నివాసం ఉంటున్న వారిని తక్షణం ఖాళీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే మిడ్ ల్యాండ్ ప్రాంతంలో దాదాపు 9 అడుగుల ఎత్తునకు వరదనీరు చేరగా, వేలాది వాహనాలు నీట మునిగాయి. వరద నీరు ప్రవహిస్తుందన్న అంచనా ఉన్న ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు.


More Telugu News