హైదరాబాద్ లో బారికేడ్లన్నీ తొలగింపు... పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వచ్చేసిన వాహనాలు!

  • దాదాపు రెండు నెలలు అమలైన లాక్ డౌన్
  • తిరిగి తెరచుకున్న షాపులు
  • వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన వాహనాలు
దాదాపు 60 రోజుల లాక్ డౌన్ తరువాత హైదరాబాద్ తిరిగి మామూలు స్థాయికి వచ్చినట్టుగా బుధవారం ఉదయం కనిపించింది. రోడ్ల కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, చెక్ పోస్టులు తొలగిపోయాయి. ప్రజలు ఏ మాత్రం కరోనాపై భయం లేకుండా, తమతమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేశారు. వీధుల్లోని షాపులన్నీ తెరచుకున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాల్స్ మాత్రం తెరచుకోలేదు. వేల సంఖ్యలో కార్లు, బైక్ లు బయటకు రావడంతో, అన్ని సిగ్నల్స్ వద్దా ట్రాఫిక్ భారీగా కనిపిస్తోంది.

ఇక పోలీసులు అన్ని ట్రాఫిక్ నిబంధనలనూ విధిగా పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించడం తప్పనిసరని, మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏ వాహనంలో ప్రయాణించినా, వాహనానికి సంబంధించిన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాయంత్రం 7 గంటల వరకే సడలింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ తరువాత బయట తిరిగే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.


More Telugu News