రేపటి నుంచి ఏపీలో బస్సు సర్వీసులు ప్రారంభం

  • 50 శాతం సీట్లకే టికెట్ల ఇష్యూ
  • టికెట్ ధరలను 50 శాతం పెంచాలని యోచన
  • విశాఖ, విజయవాడలలో సిటీ బస్సులకు అనుమతి నిల్
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల మధ్య ఓ బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు మాత్రమే బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే, విశాఖపట్టణం, విజయవాడలలో సిటీ సర్వీసులు ఉండవు. బస్సుల్లో టికెట్లు ఇవ్వరు. బస్టాండ్‌లోనే టికెట్ కొనుగోలు చేసిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. అందులో ఫిట్‌గా ఉన్నట్టు తేలితేనే బస్సు ఎక్కేందుకు ప్రయాణికులను అనుమతిస్తారు. అలాగే, ప్రయాణికుడి ఫోన్ నంబరు, గమ్యస్థానం వివరాలు కూడా సేకరిస్తారు.

బస్సు సర్వీసులన్నీ అంతర్ జిల్లాలకే పరిమితం కానున్నాయి. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కొంతకాలంపాటు బస్సులు రాష్ట్ర సరిహద్దుల వరకే నడవనున్నాయి. అయితే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారి కోసం మాత్రం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ బస్సులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అంటున్నారు. ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణలో బయలుదేరి మరెక్కడా ఆగకుండా గమ్యస్థానాన్ని చేరుకుంటాయి. అలాగే, ఆయా బస్సుల్లో వచ్చిన వారికి వైరాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, 50 శాతం సీట్లకు మాత్రమే టికెట్లు ఇచ్చి ప్యాసింజర్ సర్వీసులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ కొంతకాలంపాటు చార్జీలను 50 శాతం పెంచాలని నిర్ణయించి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపింది. సీఎం నుంచి అనుమతి లభించిన వెంటనే చార్జీల పెంపును ఖరారు చేస్తారు.


More Telugu News