అమెరికాలో మరింత పెరిగిన కరోనా తీవ్రత.. 24 గంటల్లో ఏకంగా 21,551 కేసులు

  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,03,308
  • మృతుల సంఖ్య 90,347
  • రష్యాలో 2,90,000 కేసులు
  • ప్రపంచ వ్యాప్తంగా 48,00,000కు పైగా కేసులు  
అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు ప్రతి రోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కరోనాతో 785 మంది మృతి చెందారు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,03,308గా ఉంది. మృతుల సంఖ్య 90,347కి చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

కరోనా వైరస్‌తో ప్రపంచ మొత్తం మీద నమోదైన మృతుల సంఖ్యలో మూడో వంతు అమెరికాలోనే ఉన్నాయి. ఆ దేశంలోని న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3,51,371 పాజిటివ్‌ కేసులు, 28,339 మరణాలు నమోదయ్యాయి. న్యూజెర్సీలో 1,48,240 కరోనా కేసులు, 10,439 మరణాలు సంభవించాయి. ఇల్లినాయిస్‌లో‌ 96,485, మసాచుసెట్స్‌ లో 87,052, కాలిఫోర్నియాలో 81,738 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండగా చైనాలో గత 24 గంటల్లో కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి.

అమెరికా తరువాత రష్యాలో అత్యధికంగా 2,90,000 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఆ దేశంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 48,00,000కు పైగా కేసులు నమోదు కాగా, 3,18,000 మంది ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News