కరోనా పరీక్షల కోసం సరికొత్త విధానం ప్రకటించిన ఐసీఎంఆర్

  • గత విధానాన్ని సవరించిన ఐసీఎంఆర్
  • భారత్ లో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా నూతన విధానం
  • ఫ్లూ బాధితులకు విస్తృత పరీక్షలు చేయాలని సూచన
దేశంలో కరోనా కేసులు అంతకంతకు ఎక్కువవుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షల విధానాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సవరించింది. తాజాగా రూపొందించిన కరోనా వైద్య పరీక్షల విధానాన్ని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ క్రమంలో కరోనా పరీక్షలను మరిన్ని కేటగిరీలుగా విభజించింది.

 ఈ క్రింది లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది.

  • గత 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు ఉన్నవారు.
  • కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను కలిసిన వారిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలు కలిగిన వారు.
  • కరోనాపై పోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు.
  • తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు.
  • కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని నేరుగా కలిసినా, కరోనా లక్షణాలు లేనివారు.
  • హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్నవారు.
  • ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు.
  • విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికుల్లో ఏడు రోజులుగా ఇన్ ఫ్లుయెంజా లక్షణాలతో బాధపడుతున్నవారు.
పై కేటగిరీల్లో ఎవరికైనా కరోనా టెస్టులు నిర్వహించవచ్చని, అయితే కరోనా టెస్టు చేయలేదన్న కారణంతో అనుమానితులకు ప్రసవం సహా ఇతర అత్యవసర వైద్య సేవలు ఆలస్యం చేయరాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.


More Telugu News