ఆ రెండు కుక్కలకు యజమానుల ద్వారానే వైరస్ సోకింది: హాంకాంగ్ పరిశోధకులు

  • శునకాలు, యజమాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు
  • కుక్కల నుంచి కుక్కలకు, మనుషులకు వైరస్ సోకుతుందన్న దానికి కనిపించని ఆధారాలు
  • కరోనా రోగులు జంతువులకు దూరంగా ఉండాలని సూచన
జంతువులు కూడా కరోనా వైరస్ బారినపడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. హాంకాంగ్‌లో రెండు శునకాలు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జూలోని నాలుగు పులులు, మూడు సింహాలు కరోనా వైరస్ బారినపడినట్టు వార్తలు వచ్చాయి. హాంకాంగ్‌లో ఆ రెండు కుక్కలకు వైరస్ ఎలా సోకిందన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో యజమానుల ద్వారానే వాటికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఆ రెండు శునకాలు, వాటి యజమానుల్లో వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. అయితే, కుక్కల నుంచి ఇతర కుక్కలకు, మనుషులకు వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

కరోనా బాధితుల నుంచి కుక్కలకు వైరస్ వ్యాపిస్తుందన్న విషయం నిర్ధారణ అయినప్పటికీ అందుకు గల అవకాశాలు మాత్రం చాలా తక్కువని పేర్కొన్నారు. కరోనా బాధితులతో కలిసి ఉన్న 15 శునకాల్లో కేవలం రెండింటికి మాత్రమే వైరస్ సోకిందని నెదర్లాండ్స్ వైద్యులు తెలిపారు. అయితే, పిల్లులు మాత్రం ఎటువంటి లక్షణాలు లేకుండానే ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాపింపజేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి కరోనా రోగులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


More Telugu News